Psalms 63

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినది

1దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.
2నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.

3నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.

4నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.

5కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.

6రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.

7నువ్వు నాకు సహాయం చేశావు. నీ రెక్కల నీడలో నేను సంతోషిస్తాను.

8నా ప్రాణం నీపై ఆనుకుని ఉంది. నీ కుడిచెయ్యి నాకు ఆధారంగా ఉంది.

9నా ప్రాణం తీయాలని వెతుకుతున్నవారు భూమి అడుగు భాగాలకు దిగిపోతారు.

10వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.

అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.

11

Copyright information for TelULB